తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. రిజర్వాయర్లు ఫుల్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పోటెత్తడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతుండటంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తారు. నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, నారాయణపేటలో 15 సెంటీమీటర్ల వాన కురిసింది. పెద్ద చెరువుకు అలుగు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద ప్రవాహం ఉధృతమవ్వడంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి వాగు మధ్యలో చిక్కుకుంది.

సిరిసిల్ల జిల్లా మన్వాడలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టుకు 13 వేల283 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా 10,794 క్యూసెక్కులను ఎల్ఎండీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 27.50 టీఎంసీలైతే 25.81 టీఎంసీలను మెయింటెయిన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.


జూరాల నుంచి శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగులు మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి లక్షా 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 2 లక్షల 55 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా ఉంది.

కుండపోత వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు దీవిలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలు కాలనీలు నీటమునిగాయి. పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు రోడ్లు ఛిద్రమవ్వడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. దిండి చించినాడ బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.

కర్నూలు జిల్లా మిడ్తూర్‌ మండలంలోని వ్యవసాయ సొసైటీలోకి భారీగా వాన నీరు చేరింది. దీంతో యూరియా బస్తాలు తడిచి ముద్దయ్యాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత కారణంగా నందికొట్కూరులో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఇటు ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీప్రాంతంలోని సిద్ధాపురం చెరువు అలుగుపారుతోంది. 25ఏళ్ల తర్వాత ఈ చెరువు అలుగు పారడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మ‌రి‌కొన్ని రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆదివారం మ‌రో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నివారణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story