ఏపీని బెంబేలెత్తిస్తున్న భారీ వర్షాలు

ఏపీని బెంబేలెత్తిస్తున్న భారీ వర్షాలు

భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు.. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రెల్లిపేట, ఏటిఒడ్డు వీధి, మేదరిపేట ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. అలాగే రామచంద్రపురంలో భారీ వర్షాలకు పంట పొలాలతో పాటు.. తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌ నీట మునిగాయి. ఎడతెరిపిలేని వర్షాలతో.. యానాం నియోజకవర్గంలోని ప్రధాన రహదార్లు అన్నీ జలమయం అయ్యాయి.

కాకినాడ రూరల్‌ కరప మండలంలో కురిసిన వర్షాలకు.. సుమారు 10వేల ఎకరాల వరిపంట నీట మునిగింది. అలాగే కాకినాడ మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దపురంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కుప్పకూలింది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు.

భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు ఉప్పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడులోని వాగులు, కాల్వలకు వరద పోటెత్తుతోంది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. రహదారిపైకి వరద నీరుచేరడంతో రహపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉంగుటూరు నియోజకవర్గంలోనిం భీమడోలు, గణపవరం, నిడమర్రు ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాలు వాననీటిలో చిక్కుకున్నాయి. వానలకు తణుకు పట్టణంలో జనజీవనం స్థంభించింది. ఆర్టీసీ డిపో, బస్‌స్టేషన్‌ సమీపంలోని ప్రాంతాలతో పాటు.. రహదార్లు నీటి మునిగాయి.

విజయవాడలో ఎడతెరిపిలేని వానలకు..పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి మోకాళ్లలోతు వరకు వర్షం నీరు రావడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు పనిచేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల వద్ద తువ్వా కాలువకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన ఎస్సీ కాలనీ నీటి మునిగింది. ముండ్లపాడు వద్ద గండివాగు పొంగిపొర్లుతోంది. మచిలీపట్నంలో బస్టాండ్‌ వద్ద మోకాళ్లలోతు వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో... పాలకాయ తిప్ప వద్ద.. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో లంక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

విశాఖలో కురుస్తున్న వానలకు చీడికాడ మండలం, దేవరాపల్లి మండల్లోని కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. దీంతో 2వందల గిరిజన గ్రామాలకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. నాతవరం మండలం గన్నవరంలో దొంగగెడ్డవాగు ఉధృతంగా ప్రహహిస్తోంది. వాగు దాటే క్రమంలో.. ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.

వీటితో పాటు.. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వానలు జోరుగా కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాలు నీటి మునడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు అందక.. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story