RAINS: కామారెడ్డి - హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, పొలాలు కొట్టుకుపోగా... అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కామారెడ్డిలో 49 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఈ వర్షాలకు కామారెడ్డిలో రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకు పోయాయి. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే (NH-44) జంగంపల్లి వద్ద భారీ వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో NH-44 మూసివేశారు.
ఏపీలో ఐదు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోందని, ఇది తీవ్ర అల్పపీడనం బలపడి ఒడిశా మీదుగా కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఏపీపై తీవ్ర అల్పపీడనం పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
భారీ వరదలు వచ్చినా స్పందించరా..?
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 'గత 24 గంటల్లో ఎడతెరిపిలేని వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఆహారం, నీరు కూడా అందుబాటులో లేకుండా పోయింది' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. జాతీయ రహదారి 44తో పాటు, అనేక అంతర్ జిల్లా రహదారులు కూడా కొట్టుకుపోయాయని, వాగులో చిక్కుకున్న కార్మికులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com