AP: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. ఏపీ హింసకు కేంద్రంగా మారిందని, అందులో ఎన్డీయే భాగస్వామిగా ఉందని రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. 490 ప్రభుత్వ, 560 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని, 1,050 దాడులు, 300 హత్యాయత్నాలు, 31 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. అందుకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ లెక్కలను ధ్రువీకరించాలని సూచించారు. రెండేళ్ల క్రితం సభలో సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరే అభ్యంతరం తెలిపారంటూ విజయసాయిరెడ్డికి గుర్తుచేశారు.
పోలవరం గురించి ఆయన ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ లేచి.. ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని విభజన చట్టంలో ఉందని, కానీ ఆ తర్వాత వచ్చిన ఏపీ ప్రభుత్వాలు ఆ బాధ్యతను తామే తీసుకున్నాయన్నారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని, అప్పటి సీఎం ఆ ప్రాజెక్టు నుంచి కొంత డబ్బు చేసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com