Vijayawada: విజయవాడను బెంబేలెత్తిస్తున్న ఎలకలు

Vijayawada: విజయవాడను బెంబేలెత్తిస్తున్న ఎలకలు
X
ఆదమరిస్తే అంతే మరి

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రహరీ లేకపోవడం, డ్రైనేజీ సమస్య, అపరిశుభ్రత తాండవిస్తుండటంతో... ఎటుచూసినా ఎలుకలు కనిపిస్తున్నాయి. మూషికాల దెబ్బకు ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు హడలిపోతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాల్సిన R.T.C అధికారులు... తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఎలుకల సంచారం విపరీతంగా పెరిగిపోయింది.బస్టాండ్‌లో ఎలుకలు ప్రవేశించడానికి ప్రధాన కారణం బస్టాండ్ చుట్టూ ఎత్తయిన ప్రహరీ లేకపోవడమే. బస్టాండ్‌కు ఓ వైపున పొడవాటి రైల్వే ట్రాక్ ఉంది. రైల్వేస్టేషన్ నుంచి ట్రాక్ మీదుగా బస్టాండ్‌లోకి ఎలుకలు వచ్చేస్తున్నాయి. బస్టాండ్ పక్కన విపరీతంగా ఆహార వ్యర్థాలు పడేస్తున్నారు. వీటికోసం కూడా ఎలుకలు భారీగా వస్తున్నాయి. అలాగే బస్టాండ్‌లో పాడుబడిన థియేటర్‌ను మూషికాలు ఆవాసంగా చేసుకున్నాయి. R.T.C. కార్గో కార్యాలయంలోని పార్సిళ్లను సైతం పాడుచేసున్నాయి. దీనివల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇనుప తలుపులతో తయారుచేసిన ర్యాక్‌లు ఏర్పాటుచేయాలని సిబ్బంది కోరుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు డార్మెటరీలో బస చేస్తారు. వారిపై ఎలుకలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు సహా డార్మెటరీలోని సోఫాలు, బెడ్‌లను కొరికేస్తున్నాయి. ఎలుకల సంచారంతో తీవ్రంగా నష్టపోతున్నామని డార్మెటరీ నిర్వాహకులు వాపోతున్నారు.

ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఎలుకలు పట్టే వారిని బస్టాండ్‌కు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగుసార్లు బోనులు ఏర్పాటుచేయగా... ఒక్కోసారి 400 ఎలుకలు చొప్పున దొరికాయి. దీనికోసం ఇప్పటివరకు 64 వేల రూపాయలు ఖర్చు చేసినా నివారణ మాత్రం సాధ్యపడలేదు. ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బస్టాండ్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లోపలికి వచ్చి దోపిడీలు, దాడులతో హడలెత్తిస్తున్నారు. కొంతకాలంగా ఎలుకల రూపంలో ప్రయాణికులు, సిబ్బందికి కొత్త సమస్య వచ్చింది. ఇప్పటికైనా ప్రహరీ నిర్మాణం చేపట్టి... బస్టాండ్‌ పరిసరాలు శుభ్రంగా ఉంచితే ఇబ్బందులు తొలుగుతాయని ప్రయాణికులు అంటున్నారు.

Tags

Next Story