AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీలో మూడేళ్లలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల్లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇంధన శాఖ అధికారులు, రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. 8 జిల్లాల్లో ఒక్కొక్కటీ రూ.130 కోట్ల విలువతో 500 సీబీజీ ప్లాంట్లను రిలయన్స్ నెలకొల్పుతుంది. వీటిని మూడేళ్లలో స్థాపించి రెండున్నర లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ పేర్కొంది.
స్వాగతించిన ముఖ్యమంత్రి
ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. రిలయన్స్‌తో ఒప్పందం చరిత్రాత్మకమన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు క్లీన్ ఎనర్జీ-2024 పాలసీ తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు స్పీడ్ అఫ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నామని.. పారిశ్రామిక సంస్థలు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విధానం అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ విధంగా ప్రభుత్వం, పెట్టుబడిదారులు సమాంతరంగా పరుగులు తీస్తే.. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. రిలయన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించామన్నారు. రూ.65 వేల కోట్లతో సీబీజీ ప్లాంట్లు స్థాపిస్తే రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయం లభిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఘన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు ఇస్తాం. వాటి ద్వారా కూడా గ్యాస్ ఉత్పత్తి చేయాలని రిలయన్స్‌కు సీఎం సూచించారు. క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవారు భారతీయులేనని చెప్పారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ విధానాన్ని తాము అమలు చేస్తున్నామని వెల్లడించారు.
నాలుగో వంతు మనకే: లోకేశ్
రిలయన్స్‌తో ఒప్పందంపై ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తంచేశారు. తాము నిర్దేశించుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందన్నారు. కొద్దిరోజుల కిందట ముంబైలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్న అనంత్ అంబానీతో జరిపిన చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పుడు ఒప్పందం చేసుకుందన్నారు. దేశవ్యాప్తంగా 2 వేల సీబీజీ ప్లాంట్లను పెట్టాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుందని.. వాటిలో నాలుగో వంతు.. అంటే 500 ప్లాంట్లను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంతోషంగా ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com