REPUBLIC DAY: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక. 25 లక్షల మందికిపైగా రైతుల రుణమాఫీ చేశామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామన్న గవర్నర్... సన్నరకం బియ్యానికి బోనస్ అందించామని వెల్లడించారు. తన ప్రభుత్వం 2024 వానా కాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిందన్నారు. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4,500 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. యువత సాధికారత కోసం యంగ్‌ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఏపీలోనూ
76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జెండా ఆవిష్కరించడానికి ముందు గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అందులో పోలీసులు, భారత ఆర్మీ, NCC దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రజల ఆశయాలను సాకారం చేయడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యల్లోకి నెట్టిందని గవర్నర్ విమర్శించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వానికి చర్యలు తీసుకుంటూ, ప్రజల అవసరాలను తీర్చేందుకు పని చేస్తోందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com