ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. రోడ్లపై అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం సంబురాలు రద్దు చేసింది. డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపొద్దని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తారు. అటు రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా తగ్గించారు. ప్రధాన పట్టాణాల్లో పోలీసులు నిఘా పెంచారు. కరోనా దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఇళ్లల్లోనే న్యూ ఇయర్ జరువుకోవాలని కోరారు.
యువత మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ఎవరైనా ప్రవర్తించినా కేసులు పెడతామని సూచించారు. అత్యుత్సాహంతో సైలెన్సర్లు తీసేసి వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్, కేకలు వేసినా ఊరుకునేది లేదన్నారు. ఇవాళ రాత్రి పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందన్నారు. అన్ని జిల్లాల్లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో.. అల్లరి మూకలు, రౌడీషీటర్లు రెచ్చి పోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలోని వైన్స్,బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలకు అనుగుణంగానే నడుస్తాయని.. ప్రత్యేక అనుమతులు ఏమీ లేవని.. అలాగే హోటల్స్‌లలో కూడా ఎటువంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వలేదని విజయవాడ సిపి బత్తిన శ్రీనివాస్ తెలిపారు. ప్రార్ధనామందిరాలలో కూడ కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్ధనలు జరుపుకోవాలని సూచించారు. మందుబాబులు తప్పతాగి రోడ్ల మీదకు వస్తే జరిమానాలు విధిస్తామని అన్నారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గవర్నర్‌ను కలవడం, రాజ్ భవన్‌లో ఆయనతో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకోవటం సంప్రదాయం. అయితే కరోనా మహమ్మారి దృష్ట్యా ఓపెన్ హౌస్‌తో సహా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించటం లేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కార్యదర్శి ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com