Ananthapur: విషాదం.. దైవదర్శనానికి వెళుతూ మృత్యుఒడికి..

Ananthapur: దేవుడిని దర్శించుకుందామని వెళుతున్న కుటుంబాన్ని విధి వెంటాడింది. భార్యా బిడ్డలను మృత్యుఒడికి చేర్చింది. రెయిలింగ్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తల్లీ, బిడ్డలను పొట్టన పెట్టుకుంది. అయితే తండ్రి, కుమారుడు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో చోటు చేసుకుంది.
స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు.. నగరంలోని రామకోటి కాలనీకి చెందిన రఘువరరాజా సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి ఆలయాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమ కారులో బయలుదేరారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గార్లదిన్నె వద్ద కారు అదుపుతప్పింది. దీంతో జాతీయ రహదారి పక్కన డివైడర్లకు అమర్చిన రెయిలింగ్ కారులోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య జయంతి (42), కుమార్తె కీర్తన (10) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రఘువరరాజా, కుమారుడు సంకల్స ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com