AP: నల్లజర్లలో రూ. 7 కోట్లు సీజ్
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యానులో తరలిస్తున్న 7కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. లారీ ఢీ కొట్టగా డబ్బులు తరలిస్తున్న మినీ వ్యాను బోల్తా పడింది. ఆ వ్యానులో కెమికల్ పౌడర్ బస్తాల కింద డబ్బులతో నిండిన 7 అట్టపెట్టెలను స్థానికులు గుర్తించారు. అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ డబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులను లెక్కించగా 7 అట్టపెట్టెల్లో మొత్తం 7కోట్ల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని ఓ రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనెమిల్లుకు ఆ డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆ నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించామని DSP వివరించారు.
తెలంగాణలోనూ...
మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ లో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంకు వాహనంలో సేంద్రియ ఎరువుల పేరుతో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా.. పక్క సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యం విలువ 2కోట్ల 7లక్షల 36వేలు ఉంటుందని మహబూబ్ నగర్ DSP వెంకటేశ్వర్లు తెలిపారు. మరోవైపు వరంగల్ జిల్లా వర్ధన్నపేట చెక్ పోస్ట్ వద్ద 4లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండకు ఓ వాహనంలో.. 4 లక్షల నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేనందున, ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అటు మేడ్చల్ జిల్లా కీసరలో వాహనాలు తనిఖీల్లో 18లక్షల 30వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ద్విచక్రవాహనంపై..... నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన పత్రాలు చూపనందున,..... ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అప్రమత్తంగా ఉండండి
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. పోలింగ్ ఏర్పాట్లలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. ఈనెల 13న జరిగే పోలింగ్ కు.. అవసరమైన సామగ్రి అంతా సిద్ధంగా ఉందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 3.32 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని.... EVMలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారన్న ఆయన...పోలింగ్ దగ్గర పడినందున నిఘా మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కోసం...పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు..వికాస్ రాజ్ వివరించారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుండగా 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే ఓటింగ్ నిర్వహిస్తారని CEO తెలిపారు.ఎన్నికలకు సంబంధించి సీ విజిల్ , టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com