Russia vs Ukraine War: రహస్య పత్రాలు లీక్.. ఆందోళనలో ఉక్రెయిన్‌

Russia vs Ukraine War: రహస్య పత్రాలు  లీక్.. ఆందోళనలో ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌లో కీలక యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ రూపొందించినట్లు సమాచారం

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణకు సంబంధించి కొన్ని రహస్య పత్రాలు లీక్ కావడం సంచలనంగా మారింది. ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా రూపొందించిన పత్రాలే లీకయ్యాయి. ఉక్రెయిన్‌లో కీలక యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ రూపొందించినట్లు సమాచారం. వీటిలో ఉక్రెయిన్‌, రష్యాకు చెందిన సైనికుల మరణాల సంఖ్య, ఆయా సైన్యాలకున్న ముప్పు, ఉక్రెయిన్‌ ప్రతిదాడులకు దిగాలని భావిస్తే వాటికున్న సామర్థ్యాలకు చెందిన డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా అందించిన ఆయుధాలు, శిక్షణ సహాయం, సైనిక వ్యూహాల వంటి వివరాలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాప్‌లు, చార్ట్‌లు, కొన్ని ఫొటోలపై అత్యంత రహస్యం అని ఉండటంతో.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఉక్రెయిన్‌ ప్రస్తుతం ఎస్‌-300, బల్క్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందకుంటే మే, ఏప్రిల్‌ నాటికి అవి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పత్రాలను బట్టి తెలుస్తోంది. ఉక్రెయిన్‌ సైన్యానికి వాయుసేన రక్షణ కవచంగా నిలుస్తోందని లీకైన డాక్యుమెంట్లలో ఉంది. కేవలం రష్యా, ఉక్రెయిన్‌ల సమాచారమే కాకుండా ఇజ్రాయెల్‌, దక్షిణకొరియాకు చెందిన సమాచారమూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో లీకైన ఈ డాక్యుమెంట్లు వాస్తవమైనవేనని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఈ విషయాలపై నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

ఈ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్‌ చేశారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ, మార్చి తొలివారంలోనే అవి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ వీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కీలక సమయంలో అత్యంత సున్నితమైన వివరాలు బయటకు పొక్కడంపై కలవరం చెందుతోంది. దీని వెనక రష్యా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తుంటే.. క్రెమ్లిన్‌ మాత్రం వాటిని కొట్టిపారేసింది.

Tags

Read MoreRead Less
Next Story