SAD: తీవ్ర విషాదం.. రింకూ సింగ్‌ తండ్రి కన్నుమూత

SAD: తీవ్ర విషాదం.. రింకూ సింగ్‌ తండ్రి కన్నుమూత
X
క్యాన్సర్ తో పోరాడుతూ రింకూసింగ్ తండ్రి మృతి

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. కష్టపడి ఎదిగిన తన కుమారుడి విజయాలను చూసిన తండ్రి ఇక లేరన్న వార్త రింకూ కుటుంబానికే కాదు, క్రికెట్ అభిమానులకు కూడా తీవ్ర వేదనను కలిగించింది.రింకూసింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను గ్రేటర్ నోయిడాలోని ఆస్పత్రిలో . వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగినా పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ శరీరం సహకరించలేదు. సమాచారం ప్రకారం రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించారు. అయినప్పటికీ వైద్యులు కాపాడలేకపోయారు.

టీ20 వరల్డ్ కప్ 2026తో బిజీగా ఉన్న రింకూ సింగ్‌కు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందడంతో వెంటనే జట్టును విడిచి నోయిడాకు వెళ్లాడు. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి, జింబాబ్వేతో మ్యాచ్ కోసం చెన్నైకి చేరుకున్నాడు. అయితే తుది జట్టులో అవకాశం దక్కలేదు. మ్యాచ్ అనంతరం తండ్రి మరణవార్త తెలిసి వెంటనే స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌కు బయల్దేరాడు. 28 ఏళ్ల రింకూ సింగ్ చాలా పేద కుటుంబం నుంచి ఎదిగాడు. ఆయన తండ్రి గ్యాస్ డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తన విజయాల్లో తండ్రి పాత్ర ఎంతో కీలకమని రింకూ అనేక సందర్భాల్లో వెల్లడించాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన రింకూ, భారత జట్టులో ఫినిషర్ పాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్ శైలి అభిమానులను ఆకట్టుకుంది.

రింకూ తండ్రి మరణవార్త తెలిసి క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని రింకూ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. తండ్రి మరణంతో రింకూ టీ20 వరల్డ్ కప్‌లో ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. జట్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. టీమిండియాలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. కష్టపడే కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్ ఎదుగుదలకు తండ్రి చేసిన త్యాగాలు అందరికీ గుర్తొస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Tags

Next Story