SAD: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

SAD: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
X
చదువుకోమన్నందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. చదువుపై మందలింపుతో మనస్థాపానికి గురైన ఆమె ఐరన్ మాత్రలు మింగి తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటనతో కుటుంబంలోనే కాకుండా గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కంబదూరు మండలానికి చెందిన మైథిలి పదో తరగతి చదువుతోంది. గత శనివారం చదువుపై ఆమె తల్లి మందలించిందని సమాచారం. పదో తరగతి పరీక్షలను ఎలా రాస్తావని ప్రశ్నించడంతో మైథిలి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆవేదనతో ఇంట్లో ఉన్న ఐరన్ టాబ్లెట్లు మింగింది. కొంతసేపటి తరువాత కడుపునొప్పితో బాధపడుతూ అరవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కంబదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే అక్కడ కూడా పరిస్థితి విషమంగానే ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. తల్లిదండ్రులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మైథిలి మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మార్చి 16న నిర్వహించిన తొలి పదో తరగతి పరీక్షకు మైథిలి హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కూతురు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కంబదూరు మండలంలో విషాద వాతావరణం నెలకొంది.

Tags

Next Story