Nagarjuna Sagar: కొనసాగుతున్న ఉద్రిక్తత..

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నిన్న మొదలైన హైటెన్షన్ నేడు కూడా కొనసాగుతోంది. డ్యామ్‌కు అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. డ్యామ్‌లోని 13వ గేటు నుంచి తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ ఏపీ పోలీసులు నిన్న వేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఉదయం కూడా ఆ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
ఇరు రాష్ట్రాల పోలీసులను అక్కడ మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా కొనసాగుతోంది. నిన్న మధ్యా హ్నం ఏపీ అధికారులు కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. సాగర్ కుడి కాల్ప ద్వారా దాదాపు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశముందిని అధికారులు చెబుతున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు ముందు బుధవారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసులు వచ్చారు.
అక్కడ ఏపీ పోలీసులు బారికేడ్లు పక్కకు తోసి 13వ గేట్ వద్దకు వచ్చారు. నీటిని విడుదల చేసుకున్నారు. 2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ పై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఇలాంటి గొడవే జరిగిన సంగతి తెలిసిందే. రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నారు. ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్‌గేట్ల స్విచ్‌రూమ్ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు, ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఈ ఉదయం డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు. సాగర్ వద్ద ఉద్రిక్తతపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల సమస్య కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతానని పేర్కొన్నారు.
నీటి విడుదల వివాదంపై ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, అధికారులపై సాగర్ పోలీసులు 441, 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ అధికారులు డ్యామ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, సాగర్ ప్రాజెక్టు ఈఎన్‌సీ హరి రామ్, సీఈ హమీద్ ఖాన్, రమేశ్ బాబు, ధర్మనాయక్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com