SANKRANTHI: సంబురాల సం‘క్రాంతి’

SANKRANTHI: సంబురాల సం‘క్రాంతి’
X
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి సంబరాలు

భోగి మంటలతో..

పిండి వంటతో...

రంగవల్లులతో..

గొబ్బెమ్మలతో..

బసవన్నలతో..

హరిదాసులతో..

పల్లె అందాలతో.

అందరినీ ఒక దగ్గర చేర్చి.. పలకరించేదే సంక్రాంతి..!

సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పాడి పంటలు..... పచ్చని పల్లె వాతావరణం. ఆరుగాలం రైతు చమటోడ్చి పండించిన పంట చేతి కొచ్చే సమయమిది.. ఈ సందర్ఛాన్ని పురస్కరించుకొని వేడుకగా చేసుకునే పండుగే సంక్రాంతి. ఆంధ్రులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి.

భోగభాగ్యాల భోగి...!

సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగే భోగి. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. ఆ రోజు చలిపులిని తరిమికొడుతూ చలి మంటలు వేసుకుని చలి కాగుతారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్ని దేవుని వేడుకునేందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. భోగి రోజు చిన్నారులకు రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుందని నమ్మకం.

మకర సంక్రాంతి..!

సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నందున పండుగలో రెండో రోజును మకర సంక్రాంతి అంటారు. రెండవ రోజైన సంక్రాంతి రోజు రోజు పిండి వంటలు చేసి సూర్యదేవునికి నైవేద్యంగా ప్రసాదం సమర్పిస్తారు. ఆరోజు నువ్వులు, బెల్లం దానం చేస్తే సూర్య భగవానుడు ఆశీస్సులు కలుగుతాయి. ఇంటి ముందు ముగ్గులు వేసి రకరకాల రంగులు, పూలతో అలంకరణలు చేసి, పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. ముగ్గుల చుట్టూ బత్తుకమ్మలు వేస్తూ ఆటపాటలతో మహిళలు సంబరాలు చేసుకుంటారు.

కమ్మని విందుల కనుమ..!

సంక్రాంతి పండగలో మూడవ రోజు జరుపుకునేదే కనుమ. ఈ రోజున రైతులు వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచిన పశువులను పూజిస్తారు. తాము పండించిన పంటతో పొంగలి తయారు చేసి పశువులకి నైవేద్యంగా పెడతారు. అంతేకాదు కనుమ రోజున కుటుంబంతో కలిసి, బంధువులతో కలిసి విందు భోజనాలు చేస్తారు. కనుమ రోజున జోరుగా కోడిపందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు.

లాగించే.. ముక్కనుమ..!

సంక్రాంతి పండుగలో వరుసగా నాలుగవ రోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమకు అంతంత ప్రాధాన్యత మాత్రమే ఉంది. ఈ పండుగను ఎక్కువగా ఏపీలోని ఉత్తరాంధ్రలో జరుపుకుంటారు. ఆ రోజు మాంసాహారాన్ని లాగిస్తారు. కాగా కనుమ, ముక్కనుమ రోజు ఎక్కువ ప్రయాణం చేయకూడదు. ఆ రోజు దేవతలందరూ మన ఇంటికి వస్తారని.. కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని.. ప్రయాణాలు చేస్తే కీడు జరుగుతుందని పండితులు చెబుతారు.

Tags

Next Story