AP: హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమవ్వడంతో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రాంతాలకు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు.. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని.. సాధారణ ఛార్జీలే వసూల చేస్తున్నట్లు ఆర్‌టిసి తెలిపింది. సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యాదాద్రి జిల్లా పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. పంతంగి టోల్‌ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా ఎపి నుంచి తెలంగాణవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు
సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో తిప్పలు ఉండకుండా ఏర్పాట్లపై గ్రేటర్, రంగారెడ్డి ఆర్టీసీ దృష్టి సారించింది. గతేడాది జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సులు పంపేందుకు సిద్ధమవుతోంది. పండగ ప్రయాణాల నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 1500 బస్సులు, రంగారెడ్డి రీజియన్ నుంచి 500 బస్సులను 10, 11 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడిపింది. అయితే తిరుగు ప్రయాణంలోనూ ఈ సేవలను వినియోగించుకోవాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థనల ఆధారంగా ఖాళీగా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను జిల్లాలకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
కిటకిటలాడుతున్న రైళ్లు
హైదరాబాద్ కు చేరుకునే ఫలక్‌నుమా, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్, విశాఖ, గౌతమి, నారాయణాద్రి, విశాఖపట్నం దురంతో, వందేభారత్, శబరి, విశాఖ, గరీబ్‌రథ్, జన్మభూమి తదితర రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com