SANKRANTHI: బరిలో పుంజులు..చేతులు మారిన వందల కోట్లు

సంక్రాంతి వచ్చిందంటే ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. పండుగ సంబరాల మధ్యే, సంప్రదాయం పేరిట కోడి పందేలు యథేచ్ఛగా మొదలవుతాయి. ఈసారి కూడా అదే జరిగింది. భోగి తెల్లవారుజామునే బరులు సిద్ధమయ్యాయి. పందెం పుంజులు రంగంలోకి దిగాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పందేలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే అంచనాలు కలకలం రేపుతున్నాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట, లోన–బయట ఆటలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఒక్కో బరిలో రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయని నిర్వాహకులే చెబుతున్నారు. కొన్ని పెద్ద బరుల్లో అయితే రోజుకు రూ.2 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారుతున్నట్టు సమాచారం. గ్రామాల శివార్లలో, పొలాల మధ్య, తోటల్లో, హైవేలకు సమీపంలో భారీ బరులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రి పూట కూడా పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
క్యారవాన్స్ ప్రత్యేక ఆకర్షణ
ఈసారి సంక్రాంతి సీజన్లో మరో ప్రత్యేకత ఏమిటంటే… వీఐపీల కోసం ప్రత్యేక బరుల ఏర్పాటు. ఎన్టీఆర్–ఏలూరు జిల్లా సరిహద్దుల్లో వీవీఐపీల కోసం ఏకంగా క్యారవాన్స్ ఏర్పాటు చేశారు. ఏసీ గ్లాస్ గ్యాలరీలు, ప్రత్యేక విశ్రాంతి గదులు, ప్రత్యేక భోజన ఏర్పాట్లతో ఈ బరులు క్యాసినో స్థాయిలో తయారయ్యాయి. పందేలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడను కేంద్రంగా చేసుకుని, అక్కడ బస చేసి గోదావరి, కృష్ణా జిల్లాల బరులకు వెళ్తున్నారు. దీంతో విజయవాడలోని స్టార్ హోటళ్లు, లాడ్జీలు అన్నీ నిండిపోయాయి. సుమారు 5 వేల గదులు ముందస్తుగా బుక్ అయ్యాయి. కొన్ని హోటళ్లలో వారం రోజుల వరకు రూములు దొరకని పరిస్థితి ఏర్పడింది.
‘ఢీ’కి బరులు రెడీ
అమలాపురం, రాజోలు, జగ్గంపేట, ఐ.పోలవరం, మురమళ్ల వంటి ప్రాంతాల్లో బరులు కళకళలాడుతున్నాయి. కోనసీమలో వందకు పైగా బరులు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా మురమళ్లలోని విశాలమైన ప్రదేశంలో ఫ్లడ్లైట్ల వెలుగులో నిర్వహిస్తున్న బరులు జిల్లాలోనే అతిపెద్ద వీఐపీ బరిగా పేరు తెచ్చుకున్నాయి. ఇక్కడికి వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం వంటి ప్రాంతాల్లో విజేతలకు బుల్లెట్ బైకులు, కార్లు బహుమతులుగా ప్రకటించారు. కరప మండలంలో మూడు రోజుల పందేల విజేతకు ఇన్నోవా కారును ఇవ్వనున్నట్టు నిర్వాహకులు ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది. మొత్తం మీద భోగి రోజునే ఉమ్మడి జిల్లాలో రూ.70 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయని అంచనా. సంక్రాంతి సంబరాలు, కోడి పందేలు చూసేందుకు ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి గోదావరి జిల్లాలకు వాహనాల్లో జనం పోటెత్తారు. విజయవాడ నుంచి ఆ జిల్లాలకు వెళ్లే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కలపర్రు టోల్ గేటు వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకూ 17,221 వాహనాలు దాటగా, తెల్లవారేసరికి మరో 20 వేల వాహనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. సంక్రాంతి పండుగ పేరుతో జరుగుతున్న కోడి పందేలు ఒకవైపు సంప్రదాయం అంటుంటే, మరోవైపు చట్టవిరుద్ధ జూదంగా మారాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

