SANKRANTHI: మొదలైన సంక్రాంతి సందడి

సంక్రాంతి పండుగ రాగానే నగరం ఖాళీ అవుతోంది. కుటుంబాలతో కలిసి పల్లెలకు చేరుకోవాలనే ఆత్రంతో భాగ్యనగర వాసులు భారీగా సొంతూళ్ల బాట పట్టారు. పిల్లలకు పండుగ సెలవులు, ఉద్యోగులకు వరుసగా వచ్చిన వారాంతపు సెలవులు కలిసి రావడంతో శుక్రవారం ఉదయం నుంచే ప్రయాణాల జోరు మొదలైంది. ఫలితంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, వరంగల్ వైపు వెళ్లే వాహనాలతో రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారులపై వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. శుక్ర, శనివారాల్లో సుమారు మూడు లక్షల మంది నగరాన్ని విడిచి పల్లెలకు వెళ్లినట్లు పోలీసుల అంచనా. బస్సుల సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీసీ ‘గమ్యం’ యాప్‌ను లక్షలాది మంది వినియోగించారు. అయితే సంక్రాంతి వంటి కీలక సమయంలో యాప్ మొరాయించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా ‘నో సిటీ సర్వీస్’ అనే ఎర్రర్ రావడంతో బస్సుల వివరాలు తెలియక ఇబ్బందులు పడ్డామని పలువురు వాపోయారు.
డ్రోన్లతో పర్యవేక్షణ
సంక్రాంతి పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సూర్యాపేట వద్ద పోలీసులు డ్రోన్ కెమెరాలతో హైవేపై ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. వాహనాలు క్రమ పద్ధతిలో వెళ్లేలా చూస్తున్నారు. ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే.. వెంటనే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
ట్రాఫిక్ క్లియర్ చేసిన సినీ నిర్మాత
నందిగామ వద్ద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్వయంగా క్రమబద్ధీకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ అంతరాయం కలగడంతో, ఆయన స్వయంగా రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రోడ్డు మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఆరు గంటల ప్రయాణం కాస్తా చాలా ఆలస్యమైందని అసహనం వ్యక్తం చేశారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏటా కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఒక నూతన టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్లాట్‌ఫాంలపై పర్యవేక్షణ పెంచి, ప్రయాణికులను క్రమబద్ధంగా రైళ్లలోకి పంపించారు. అదనపు సిబ్బందిని నియమించి, భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

