SANKRANTHI: అమలాపురం రోడ్లపై టెస్లా సైబర్ ట్రక్ సందడి

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో ఈసారి ఒక అరుదైన అతిథి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘అమలాపురం అల్లుడు’ ఆదిత్య రామ్ తాను కొత్తగా కొనుగోలు చేసిన టెస్లా సైబర్ ట్రక్‌తో పట్టణానికి రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. గతేడాది రోల్స్ రాయిస్‌లో వచ్చిన ఆయన, ఈసారి అత్యాధునిక డిజైన్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ వాహనంలో మెరిశారు. భారత్‌లో ఇంకా అధికారికంగా విడుదలకాని ఈ ట్రక్‌ను ఆయన ప్రైవేటుగా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ వింత కారును చూసేందుకు జనం ఎగబడ్డారు. అమలాపురం వీధుల్లో సైబర్ ట్రక్ వెళ్తుంటే సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడటంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
కోనసీమలో ప్రభల ఉత్సవ వైభవం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం మండలాలకు చెందిన 11 ఏకాదశరుద్ర ప్రభలను గ్రామాల్లో ఊరేగిస్తూ జగ్గన్నతోటకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాల భారీ ప్రభలను యువకులు భుజాలపై మోస్తూ ఎగువకౌశిక నదిని దాటించే దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
కనులపండువగా గోదా కల్యాణోత్సవం
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవన మైదానంలో గురువారం రాత్రి గోదా కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి, శాస్త్రోక్తంగా వేడుకను నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ వంటి క్రతువులు నిర్వహించగా, భక్తులు గోవింద నామ స్మరణతో తన్మయత్వం చెందారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల కీర్తనలు, ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థుల నృత్యరూపకం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు తదితర ఉన్నతాధికారులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు, పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మార్గశిర మాసం ముగింపు సందర్భంగా జరిగిన ఈ విశేష ఉత్సవం ద్వారా లోకకల్యాణం కలగాలని అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

