SC: అప్పుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ట్రయల్‌ను నవంబర్ 18లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చే పరిస్థితి రాకముందే తొందరపాటుగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయనే సూచనలు చేసింది.
అప్పట్లో విధుల్లో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఈ వ్యవహారంలో ఏమి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. కేసు నిష్పక్షపాతంగా, వేగంగా సాగేందుకు హైకోర్టు ఒక సీనియర్ న్యాయాధికారిని ట్రయల్ కోసం నియమించాలని ఆదేశించింది. అలాగే రోజువారీ విచారణ జరగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్చి 31లోపు ప్రత్యేక జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఈ కేసులో హైకోర్టు అనవసర జోక్యం చేసుకొని అడ్డంకులు సృష్టించవద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ కేసు విచారణను వేగవంతం చేసి న్యాయం జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
