ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక అధికారిగా ఐజీ సంజయ్ కుమార్ నియామకం

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఎస్‌ఈసీ విజ్ఞప్తి మేరకు.. ఆయా అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఐజీ సంజయ్ కుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు రమేష్ కుమార్.
2021 ఓటర్ల జాబితా ప్రచురణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్ల వీరిద్దరూ విధులు నిర్వహించేందుకు అనర్హులంటూ ప్రకటించింది ఎస్‌ఈసీ. వీరిద్దరిని తొలగించాలని ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ విధి నిర్వహించ లేదన్నారు. అందుకే వీరిని అభిశంసన చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా విధుల నుంచి తప్పుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులుకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌కూ బదిలీ అయింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ దినేశ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌రెడ్డిని జీఏడీకి అటాచ్ చేశారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈచర్యలు చేపట్టింది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో 9 మంది అధికారులు అలసత్వం వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ.. సీఎస్, డీజీపీకి లేఖ రాశారు. అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల సీఎస్, డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ రాయడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com