FEST: తుది అంకానికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

FEST: తుది అంకానికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు తుది అంకానికి చేరుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని కూటగుళ్లలో యర్రదొడ్డి గంగమ్మను రకరకాల పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వాసవి కనకపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఉయాలోత్సవం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్‌లో అమ్మవారి ఊరేగింపులో యువకులు వినూత్నరీతిలో విన్యాసాలు చేశారు. నెల్లూరులో అమ్మవార్ల ఊరేగింపు అట్టహాసంగా సాగాయి. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిగా దర్శనమిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కోటదుర్గమ్మ అమ్మవారు సూర్యప్రభ సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో దేవతామూర్తుల వేషాలు,బాణాసంచా కాల్పులు అట్టహాసంగా జరిగాయి. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో జమ్మి వేట మహోత్సవం వైభవంగా జరిగింది.


తెలంగాణలో విజయదశమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఆలయాల్లో జమ్మి చెట్లకు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రావణదహణాలను ఉత్సాహంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రులు ముగింపు వేళ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దసరా పండుగు పురస్కరించుకొని ప్రజలు అనేక సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మి చెట్లకు ప్రత్యేక పూజలు, వివిధ కళా ప్రదర్శనలు, రావణ దహనాలతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని ఆలయ మాడవీధిలో స్వామిని ఊరేగించిన అనంతరం స్వామి ముందు జమ్మికొమ్మను పెట్టి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతి, అవబృత స్మపనము, శమీ పూజ, నదీహారతి, తెప్పోత్సవము, ధ్వజఅవరోహణము వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


భద్రాచలం ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు మహా పట్టాభిషేకం వేడుక నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై శ్రీరాముడిని, అశ్వవాహనంపై లక్ష్మణ స్వామి దసరా మండపం వద్దకు తీసుకెళ్లి షమీ పూజ, స్వామి ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవంలో భాగంగా ఆలయ EO రమాదేవి రావణాసుర దహనం నిర్వహించారు. దసరా వేడుకలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో మహా నవరాత్రి ఉత్సవ్‌ ముగింపు సంబరాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో గర్భా నృత్యాలతో హోరెత్తించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. బాణాసంచాతో స్వాగత తోరణం, స్వస్తిక్‌, సిరిమల్లె చెట్టు, పున్నమినాగు వంటి ఆకారాలు రూపొందిచారు.

Next Story