AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక కోలాహలం

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భక్తుల రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. వివిధ రకాల వేషధారణలు, కోలాటాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర, ర్యాలీలు కన్నుల పండువగా జరిగాయి. పలుచోట్ల వైభవంగా సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విశ్వహిందూ పరిషత్ , సమరసత సేవా ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. చిన్నారులు సీతారాముల వేషధారణలతో అలరించారు. వాయిద్యాలు, కోలాటాల నడుమ అంగరంగ వైభవంగా రాములోరి ఊరేగింపు నిర్వహించారు. అల్లూరి జిల్లా పాడేరులో దింసా నృత్యాలు, రామలక్ష్మణ వేషధారణలతో అంబేద్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేశారు. చిన్నాపెద్దా నృత్యాలు చేస్తూ రాముడ్ని కీర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి శ్రీనివాస్.. శ్రీ రాముడి సైకతాన్ని తీర్చిదిద్ది భక్తిని చాటుకున్నాడు.
కడప జిల్లా పులివెందులలో విశ్వహిందూ పరిషత్, బీజేపీ హిందూ సంఘాల నేతృత్వంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు చిందేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కర్నూలులో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇస్కాన్ భక్తుల కోలాటాలు, బాణాసంచా మోతల నడుమ ర్యాలీ కోలాహలంగా సాగింది. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా జరిగింది. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో శిరస్సు పై కలశాలు ఉంచుకొని రామనామస్మరణ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో శ్రీరాముడి చిత్రపటంతో ఊరేగింపు చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.
మరోవైపు అయోధ్యలో అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట ప్రారంభ మహోత్సవానికి ముహూర్తం సమీపిస్తున్న వేళ...ఆ క్రతువుకు హాజరయ్యే ప్రముఖుల జాబితా బయటకు వచ్చింది. మెుత్తం 8వేల మందిని ఆహ్వానించగా...అందులో 506మంది జాబితా-Aలో ఉన్నారు. వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సచిన్ తెందూల్కర్ తదితరులు ఉన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్, ప్రభాస్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ తదితరులు ఉన్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, అజయ్ దేవ్‌గన్, కంగనారనౌత్, మాధురిదీక్షిత్, హేమమాలినీ, సన్నీ దియోల్‌లు ఉన్నారు. సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్, గేయ రచయిత, కవి మనోజ్ ముంతాషిర్, ఆయన సతీమణి ప్రశూన్ జోషి, ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. గాయకులు శ్రేయాగోషల్, కైలాస్ ఖేర్, శంకర్ మహదేవన్, సోనూనిగమ్, అనురాధ పాడ్వాల్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ ట్రస్టు ఆహ్వానించింది. రామాయణ ధారావాహికలో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపిక కూడా ఆహ్వానాలు అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com