BALAKRISHNA: నందమూరి నట సింహానికి పద్మభూషణ్‌

BALAKRISHNA: నందమూరి నట సింహానికి పద్మభూషణ్‌
X
1960 తర్వాత నందమూరి కుటుంబానికి పద్మ పురస్కారం.. సినీ రంగంలో మరో ఇద్దరికి కూడా..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందించి గౌరవించింది. సినీరంగంలో ఎన్నో సేవలు అందించిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. సినీరంగంలో బాలకృష్ణతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. కేంద్రం మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించారు. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.

సినిమా రంగంలోనేకాదు..

సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూనే.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు బాలకృష్ణ సహాయం అందిస్తున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్నారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఇప్పటి వరకూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2019లో ఏపీ మొత్తం వైసీపీ గాలి వీచినప్పటికీ.. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓ వైపు ఎమ్మెల్యేగా రాజకీయాలు నడిపిస్తూనే.. మరోవైపు సినీ నటుడిగా వరుస హిట్లు అందుకుంటున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే కళారంగంలో బాలయ్య సేవలకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.


1960 తర్వాత నందమూరి కుటుంబానికి..

1960ల్లో ఎన్టీఆర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు.. కొన్ని పరాజయాలూ ఉన్నాయి. అపజయానికి ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. విజయానికి దగ్గిర దారులు వెదుక్కుంటూ రాజీ పడలేదు. డైలాగ్‌ చెప్పడంలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ బేస్‌ వాయి్‌సలో ఆయన తెరపై డైలాగులు చెబుతుంటే థియేటర్లు దద్దరిల్లి పోతుంటాయి. తండ్రి ఎన్టీఆర్‌లా బాలకృష్ణకు కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజజీవితంలో కూడా తన ఆహార్యం, అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు.

క్రమశిక్షణే కవచం

క్రమశిక్షణకు బాలకృష్ణ ప్రాణం ఇస్తారు. అలాగే ఆయనది ముక్కుసూటితత్వం. నాన్చుడు వ్యవహారం ఆయనకు నచ్చదు. మనసులో ఏముందో అది బయటకు చెప్పడం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం అలవాటు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్‌ సంపాదించుకున్నారు.

Tags

Next Story