ఆస్తుల కేసులో దోషిగా తేలతాననే భయంతోనే లేఖ రాశారు : అశ్విని కుమార్ ఉపాధ్యాయ

న్యాయమూర్తులపైన, న్యాయవ్యవస్థపైన కొన్ని ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది కచ్చితంగా న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమంటూ జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ CJIకి లేఖ రాశారు. ఇలాంటి మోసపూరిత చర్యలకు ఇంకెవరూ పాల్పడకుండా సుప్రీంకోర్టు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని CJI దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్ట్ 9 మంది జడ్జీల ధర్మాసనం అంటే ఫుల్ బెంచ్ వెంటనే సమావేశమై.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ CJకి అశ్విని కుమార్ ఉపాధ్యాయ తన లేఖలో CJIని కోరారు.
రాజకీయ నాయకుల అవినీతిపై సత్వర విచారణ జరపాలన్న కేసులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషనర్‌గా ఉన్నారు. దీనిపై విచారణ తర్వాతే ధర్మాసనం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసుల విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ తన ఆస్తుల కేసులో దోషిగా తేలతాననే భయంతో న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా లేఖ రాశారని అశ్విని అన్నారు. 6వ తేదీన జగన్ లేఖ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆ కుట్రలో భాగమే అన్నారు. ఇది న్యాయస్థానాలపై ఒత్తిడి తీసుకువచ్చే కుటిల ప్రయత్నమని మండిపడ్డారు.
అవినీతి, మనీలాండరింగ్, ఆస్తుల కేసులో విచారణ పూర్తైతే.. జగన్మోహన్ రెడ్డి కనిష్టంగా పది సంవత్సరాలు గరిష్టంగా 30 ఏళ్లు జైలుకి వెళ్లక తప్పదని అన్నారు. తాను వేసిన పిటిషన్‌పై విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలోనే.. జగన్ మోసపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాలను బెదిరించే ప్రయత్నాల్ని ఎవరూ ఉపేక్షించకూడదని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com