Vamshi: వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Vamshi: వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
X
వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయన్న పోలీసులు... బెయిల్ ఇవ్వొద్దని వాదన

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వంశీ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. వంశీపై ఇప్పటికే 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వంశీకి శాంతి భద్రతలు అంటే అసలు పట్టింపేలేదని అన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీదే కీలక పాత్ర అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్‌ చేశాడని గుర్తించినట్లు ప్రస్తావించారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, అతనికి నేర చరిత్ర ఉందని, ఇప్పటి వరకు 16 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వంశీని పట్టుకునేందుకు ఎన్టీఆర్‌ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

విచారణలో కీలకంగా మారిన వంశీ ఫోన్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణలో ఆయన ఫోన్ కీలకంగా మారనుంది. దీంతో వంశీ ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వంశీ నివాసంలోనే ఫోన్ ఉన్నట్లు సమాచారం. దీంతో గన్నవరంలోని వంశీ నివాసంలో పోలీసులు సోదాలు చేయనున్నారని తెలుస్తోంది.

వంశీ కేసుల విచారణ సీఐడీకి..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. గత కేసులను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గన్నవరంలో మట్టి అక్రమ తవ్వకాలపై గతంలోనే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. 2019లో నకిలీ పట్టాల పంపిణీ కేసు కూడా ఉంది. ఈ కేసుల విచారణను సీఐడీ, లేదా సిట్ కు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర: వంశీ భార్య

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన భార్య పంకజశ్రీ ఆరోపించారు. వంశీని పోలీసులు అరెస్టు చేయడం.. కోర్టు రిమాండ్ విధించడంపై ఆమె స్పందించారు. తన న్యాయ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. వంశీకి ఆరోగ్యం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టుకి కచ్చితంగా వెళ్తామని పంకజ శ్రీ తెలిపారు.

Tags

Next Story