SHARMILA: ఈ పాపం.. వైఎస్ జగన్‌దే: షర్మిల

వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. సీవోఏ(కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్) అనుమతులు లేకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని వర్సిటీ యాజమాన్యాన్ని షర్మిల సూటిగా ప్రశ్నించారు. " ఇది జగన్ మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి నిర్లక్ష్యం. ఇక్కడ అనుమతులు లేవని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికారంలో ఉన్నప్పుడు అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? సీవోఏ ఢిల్లీలోనే ఉంటుంది కదా.. ఎంపీ అవినాశ్ ఎందుకు వారితో మాట్లాడలేదు?” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. " ఒక్కో విద్యార్థి 15 లక్షల మేర ఖర్చు పెట్టీ చదివారు. 5 ఏళ్లు ఈ కోర్సు చదివి ఇప్పుడు పూర్తి చేసుకోబోతున్నారు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. ఇలాంటి సమయంలో వాలిడేటెడ్ సర్టిఫికేట్ వస్తుందో లేదో తెలియదు.’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థ చెడిపోయింది
‘మన సిస్టమ్ చాలా చెడిపోతుంది. ఇది అనార్గనైజ్డ్ సిస్టమ్. ఇది చాలా చాలా బాధాకరం. 2020లో ఈ యూనివర్సిటీ స్థాపించారు. అప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్టిటెక్క్చర్ అనుమతి ఇవ్వలేదు. తొలి బ్యాచ్ లో చేరికలకు ప్రభుత్వం మభ్య పెట్టింది. ఇది చాలా అన్యాయం’అంటూ షర్మిల ధ్వజమెత్తారు. ‘ఇప్పటి వరకు తొలి బ్యాచ్ ఎన్రోల్మెంట్ లేదు. ఆ తర్వాత మూడు ఏళ్లు వరుసగా ఎన్రోల్మెంట్ లేదు. ఇది తీరని అన్యాయం. ఇలా ఎలా విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టారు’అని షర్మిల నిలదీశారు.
చేసిన తప్పును సరిదిద్దలేరా..?
‘ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా ?. ఏడాదిగా COA అనుమతులు కావాలని విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. కూటమి సర్కార్ ను అడుగుతున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది..COAఢిల్లీలో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని చేతుల్లో పెట్టుకొని ఈ చిన్న పనికి ఎందుకు పట్టింపు లేదు’అని షర్మిల మండిపడ్డారు. ‘సర్టిఫికెట్ లేకుంటే... విద్యార్థుల జీవితాలు ఏమవ్వాలి ?. చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. COAతో వెంటనే చర్చలు జరపండి’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు. ‘YSR యూనివర్సిటీ పేరు మార్చాలి అనుకుంటున్నారు అని తెలిసింది. మీరేదైనా చేయండి... విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి.’ అని షర్మిల హితవు పలికారు. విద్యార్థుల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com