SIT: కల్తీ నెయ్యి ల్తీకేసు.. 36 మందిపై సిట్ ఛార్జ్‌షీట్!

SIT: కల్తీ నెయ్యి ల్తీకేసు.. 36 మందిపై సిట్ ఛార్జ్‌షీట్!
X
సిట్ దర్యాప్తులో కీలక పరిణామం

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ మేరకు 36 మందిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితులలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఇందులో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న పేరు కూడా ఉంది. మరో 11 మంది ఉద్యోగులపై చర్యలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2019-2024 మధ్య కాలంలో సుమారు రూ. 235 కోట్ల విలువైన 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లు సిట్ నిర్ధారించింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ కాంట్రాక్ట్ తీసుకోగా, ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ సబ్ కాంట్రాక్టు ద్వారా కీలక పాత్ర పోషించింది. అసలు పాలు, నెయ్యి ఉత్పత్తి లేకపోయినా ఈ డెయిరీ నుంచి సరఫరా జరిగినట్లు దర్యాప్తులో తేలింది. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే నెయ్యి బాగుందని టీటీడీ అధికారులు నివేదికలు ఇచ్చారని, భక్తుల ఫిర్యాదులను సైతం బేఖాతరు చేశారని సిట్ పేర్కొంది.

ప్రత్యేక బృందాలు గాలింపు

ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే, కల్తీ నెయ్యి సరఫరా నెట్‌వర్క్ మరింత విస్తృతంగా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆహార పదార్థాలతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తప్పవని SIT స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ, తనిఖీలు పెంచాలని ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్లు సమాచారం. అవసరమైతే అదనపు ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మొత్తంగా, కల్తీ నెయ్యి లీక్ కేసులో 36 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు కావడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. కోర్టు విచారణలో నిజాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని, బాధ్యులపై చట్టపరమైన శిక్షలు పడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story