Srikakulam: విధి రాత.. తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు వెళ్లి..

Srikakulam: కొంచెం కూడా జాలీ దయ లేదు మృత్యువుకి. ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో తెలియదు. విధి విచిత్రం కాకపోతే అసలే కుటుంబ పెద్ధను కోల్పోయి కృంగిపోయిన కుటుంబానికి వెంటనే మరో విషాదాన్ని మిగిల్చింది.తండ్రి కర్మకాండలు చేసేందుకు నదికి వెళ్లిన కొడుకుని కూడా మృత్యువు కబళించింది.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని గొట్టా బ్యారేజీ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఆర్ఆర్ కాలనీకి చెందిన దుబ్బారపు లలిత్ సాగర్ (30) సాప్ట్‌వేర్ ఇంజనీర్. తండ్రి సూర్యారావు ఆర్‌ఎంపీ వైద్యుడు. ఇటీవల అతడు గుండెపోటుతో మరణించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు లలిత్ సాగర్ వంశధార నది వద్దకు వచ్చాడు. కార్యక్రమంలో భాగంగా
స్నానం చేసేందుకు నదిలోకి దిగాడు. అంతే మళ్లీ బయటకు రాలేదు. ఆ సమయంలో బ్యారేజ్ వద్ద ఉన్న మత్స్యకారులు ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినప్పటకీ ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 9 నెలల చిన్నారి ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో తండ్రీకుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com