AP: జమ్ముకశ్మీర్ లో నేలకొరిగిన ఏపీ జవాన్

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు. భద్రతా దళాలు జలూర గుజ్జర్‌పటి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదుల స్థావరాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వీర జవాన్ కార్తీక్ గ్రామంలో విషాదఛాయలు
ముష్కరుల దాడిలో మరణించిన వీర జవాన్ కార్తిక్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఎగువ రాగిమానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ తల్లిదండ్రులు వరదరాజులు, తల్లి సెల్వి. వీరిది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ మధ్యలో ఆపేసి 2017లో సైన్యంలో చేరిన కార్తీక్ ప్రస్తుతం కశ్మీర్‌లో పనిచేస్తున్నారు. మృతదేహం మూడు రోజుల్లో స్వగ్రామానికి వస్తుందని భావిస్తున్నారు. కార్తీక్, జమ్మూకాశ్మీర్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో.. గ్రామంలో ప్రజలు తరచూ అతని గురించి అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు అతను అమరుడయ్యాడని తెలియడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గ్రామానికి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com