- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- Special Status: ప్రత్యేక హోదా అంశం...
Special Status: ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేదు: స్పష్టం చేసిన కేంద్రం

Special Status: ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదంటూ మరోసారి స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల కారణంగానే.. జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు హోదా ఇచ్చిందని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదని తెలిపింది. ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు.. నిధుల బదలాయింపునకు 14వ ఆర్థికసంఘం ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకుందని స్పష్టం చేసింది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు 2015-20 మధ్య.. పన్నుల వాటాను 42 శాతానికి పెంచామని కేంద్రం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని, నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేర ప్రతి రాష్ట్రానికి వనరులు అందించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం సమాధానం ఇచ్చింది. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు కింద గ్రాంట్స్ ఇస్తున్నామని కేంద్రం స్పష్టత ఇచ్చింది.
25 మందికి ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఎలా రాదో చూస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన సందర్భం ఒక్కటి కూడా లేదని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఓవైపు ప్రత్యేక హోదా అడుగుతూనే ఉన్నామని అధికార వైసీపీ చెబుతున్నప్పటికీ... కేంద్రం మాత్రం చాలా క్లియర్‌గా ప్రత్యేక హోదా అన్నది ఇక లేనే లేదని చెబుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com