Tirupati: తిరుపతిలో పెనువిషాదం , వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాటలో 6 గురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్దకు భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో ఈ ఘటన జరిగింది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీకి తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. 9వ తేదీ (గురువారం) ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతోపాటు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో (జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి) తొక్కిసలాట జరిగింది.
మొదట జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. రాత్రి 8.15 గంటల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికే నలుగురు మృతి చెందినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.
తొక్కిసలాటలో మరో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారిలో 12 మందికి స్విమ్స్‌లో, 36 మందికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com