TIGER: ఆకలితో పెద్ద పులి..ఆదమరిస్తే బలి

పశ్చిమ గోదావరిలో ఐదు రోజులుగా ఒక పెద్ద పులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. అడవిని దాటి గ్రామాల వైపు వస్తూ రోజుకో ప్రాంతంలో ప్రత్యక్షమవుతున్న ఈ పులి, పశువులపై దాడులు చేస్తుండటంతో స్థానికులు రాత్రిళ్లు నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులకూ ఈ పులి కదలికలు పెద్ద సవాలుగా మారాయి. మంగళవారం రఘునాథపురం పరిసరాల్లో ఒక పశువును బలితీసుకున్న పులి, మరుసటి రోజు రాత్రి రాజానగరం మండల పరిధిలో మళ్లీ దాడి చేసింది. పుణ్యక్షేత్రం–జి.యర్రంపాలెం గ్రామాల మధ్య ఉన్న తోటల్లో వరుసగా మూడు ఆవులు, ఒక దూడను చంపింది. ముందుగా పుణ్యక్షేత్రం గ్రామంలోని ఒక పామ్ ఆయిల్ తోటలో ఆవును చంపిన పులి, అనంతరం సమీపంలోని మరో తోటకు వెళ్లి మిగిలిన పశువులపై దాడి చేసింది. గురువారం ఉదయం పశువుల శవాలను గుర్తించిన గ్రామస్థులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి అధికారులతో చర్చలు జరిపారు. పులి ఎక్కడ నక్కి ఉందో గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. పుణె, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు రాజమహేంద్రవరం చేరుకుని, పులిని సురక్షితంగా పట్టుకునే ప్రణాళికను అమలు చేస్తున్నారు.
అధికారుల అంచనా ప్రకారం, ఈ పులి మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినట్టు భావిస్తున్నారు. దట్టమైన పొదలు, చెరకు తోటలు ఉండటంతో పగటిపూట పులి ఎక్కడ దాగి ఉంటుందో గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డ్రోన్ కెమెరాల సహాయంతో పులి కదలికలపై నిఘా పెట్టారు. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా జంతువులను గుర్తించే థర్మల్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. అయితే ఈ కెమెరాలు పూర్తిగా చీకటి పడిన తర్వాతే సమర్థవంతంగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పెద్ద పులి రోజుకు 16 నుంచి 20 కిలోమీటర్ల వరకు సంచరించే సామర్థ్యం కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆకలి ఎక్కువైనప్పుడు రోజుకు దాదాపు 40 కిలోల మాంసం అవసరం అవుతుందని అంచనా. ఇదే కారణంగా పశువులపై దాడులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. పులిని బయటకు రప్పించేందుకు ఆహారం ఆశ చూపించి, దాని కదలికలను నియంత్రించే యత్నాలు జరుగుతున్నాయి. సరైన సమయం చూసి మత్తు మందు ఇంజక్షన్‌తో పులిని నిశ్చేష్టం చేసి, బంధించి అటవీ ప్రాంతంలో వదిలే ప్రణాళికను అధికారులు అమలు చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
