పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైన ఏపీ అధికార యంత్రాంగం
ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. శుక్రవారం తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండగా ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంచాయతీ ఎన్నికల సన్నాహాలు, తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు.
ఎన్నికలకు సహకరించని అధికారులకు సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్లాన్-బి అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిన్నటి వరకు ఎన్నికలకు అధికారులు సహాయ నిరాకరణ చేయడంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ రాశారు. కేంద్ర బలగాలను పంపాలని కోరారు. ఈ అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియకు సహకరించని అధికారులను ఇప్పటికే పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
అటు.. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో నిధుల సమస్యపై పలువురు కలెక్టర్లు సమావేశంలో ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే, ఏకగ్రీవాలను స్వాగతించాలని.. కానీ, ఎన్నికల నిర్వహణే ప్రథమ ప్రాధాన్యమని గుర్తు చేశారు. అలాగే వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వీడియో కాన్ఫరెన్స్‌కు ముందు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు నిమ్మగడ్డ రమేష్. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికలకు పూర్తి స్థాయి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఆదేశించాలని కోరారు. తాజాగా కొందరు అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ఎస్‌ఈసీ గవర్నర్‌కు తెలిపారు. ఎస్‌ఈసీ భేటీ తర్వాత.. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటికే 13 జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎన్నికల ప్రక్రియపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందిలో ఆరోగ్య సమస్యలు వున్నవారి విషయంలో మినహాయింపుపై ఆలోచిస్తున్నామని డీజీపీ చెప్పారు.
ఇక పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. 2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే యువత ఓటు హక్కు కోల్పోతుందంటూ పిటిషన్ వేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విచారణ మంగళవారానికి వాయిదా వేయగా, బుధవారం బెంచ్ ముందుకు వచ్చింది. శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పగా.. ఆరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com