రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అక్కసు

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అక్కసు
రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం అక్కసు మరోసారి బయటపడింది. అమరావతి రైతులపై మళ్లీ కేసులు కలకలం రేపుతున్నాయి. 11 మంది కృష్ణాయపాలెం రైతులపై మంగళగిరి రూరల్‌..

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం అక్కసు మరోసారి బయటపడింది. అమరావతి రైతులపై మళ్లీ కేసులు కలకలం రేపుతున్నాయి. 11 మంది కృష్ణాయపాలెం రైతులపై మంగళగిరి రూరల్‌ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. రెండ్రోజుల కిందట మూడు రాజధానులంటూ పెయిడ్‌ ఆర్టిస్టులు ఆటోల్లో వస్తుండగా.. కృష్ణాయపాలెం వద్ద బీసీ, దళిత రైతులు అడ్డుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 11 మంది కృష్ణాయపాలెం రైతులపై కేసులు నమోదయ్యాయి. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా... అమరావతి కోసం ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు.

మొన్న మూడు రాజధానులకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు పెయిడ్ ఆర్టిస్టుల పనేనని మరోసారి స్పష్టంగా బయటపడింది. మంగళగిరి సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొందర్ని ఆటోల్లో ఎక్కించుకుని మరీ రాజధాని ప్రాంతానికి తీసుకుని వచ్చి ధర్నాలు చేయిస్తున్నారని రాజధాని అమరావతి దళితులు మండిపడుతున్నారు. డబ్బులకు మనుషుల్ని తీసుకొచ్చి ధర్నాలు చేయిస్తూ అమరావతి ఉద్యమంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆధారాలతో సహా చూపిస్తున్నారు.

మొన్న పెనుమాక, కృష్ణాయపాలెం మధ్య 15 ఆటోల్ని ఆపిన స్థానిక దళితులు, ఆటోల్లో వారిని నిలదీశారు. ఎందుకు రాజధానికి వస్తున్నారని ప్రశ్నించారు. దీంతో తత్తరపడిన పెయిడ్‌ ఆర్టిస్టులు తాము కూడా లోకల్ వాళ్లమేనని బుకాయించే ప్రయత్నం చేశారు. ఐతే, ఆధార్ కార్డులు చూపించండి అంటూ నిలదీసేసరికి షాక్‌ అయ్యి ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. స్థానిక YCP ప్రజాప్రతినిధే వీరందరితో నకిలీ ఉద్యమం చేసేందుకు తీసుకువెళ్తుండడం పట్ల దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పెయిడ్‌ ఆర్టిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేసిన దళిత జేఏసీ నాయకురాలు శిరీషతో పాటు, మరికొందరు దళితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెయిడ్‌ ఉద్యమ కారులను నిలదీసే ప్రయత్నం చేస్తే తమపైనే పోలీసులు దౌర్జాన్యానికి పాల్పడడం దారుణమంటున్నారు దళిత రైతులు.

ఇదిలా ఉంటే... అమరావతిపై కుట్రలు చేసేందుకు నిన్న మరో పెయిడ్‌ బ్యాచ్‌ దిగింది. రాజధాని రైతులకు పోటీగా మందడంలో దీక్షా శిబిరం పుట్టుకొచ్చింది. ఆ దీక్షా శిబిరంలో ఎవరైనా అడిగితే ఎలా చెప్పాలనే దానిపై పెయిడ్‌ ఆర్టిస్టులకు ట్రైనింగ్‌ ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో కొంతమంది దీక్షా శిబిరంలోనే ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఏ ఊరు, ఎక్కడ్నుంచి వచ్చారు అని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో మాదీ ఒక గ్రామం బేతపూడి అని చెప్పాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారని... మాకూ అన్యాయం జరుగుతోందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ, అమరావతి గ్రామాల ప్రజలకు తెలియాలనే దీక్షల్లో పాల్గొంటున్నట్లు చెప్పాలంటూ శిక్షణ ఇచ్చారు. ఒకవేళ డబ్బులిచ్చి పంపించారా అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఎలా జవాబు ఇవ్వాలో కూడా పక్కాగా ట్రైనింగ్ ఇస్తోంది పెయిడ్‌ బ్యాచ్‌.

ఇప్పటి వరకు కేసులతో, దౌర్జన్యాలతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.... ఇప్పుడు పెయిడ్‌ ఆర్టిస్టులను అడ్డుకున్న అమరావతి దళిత రైతులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అమరావతే రాజధానిగా కొనసాగాలన్న ఏకైక నినాదంతో 313 రోజులుగా ఉద్యమం చేస్తున్న తమపై దిగజారి వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతలు..... ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని నిలదీస్తున్నారు. తాము ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు పెయిడ్ బ్యాచ్‌ అని వాళ్లంతన వాళ్లే ప్రూప్‌ చేసుకున్నారని అంటున్నారు. అమరావతిని సమాధి చేయడానికే ముఖ్యమంత్రి సిద్ధమవడం దుర్మార్గమరి రాజధాని ప్రాంత దళిత మహిళలు మండిపడుతున్నారు.

Tags

Next Story