గాజువాకలో ఉక్కు సెగ

గాజువాకలో ఉక్కు సెగ
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 150 మందితో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

గాజువాకలో ఉక్కు సెగ రేగుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమవుతుందని, ఏదోవిధంగా కాపాడుకోవాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉద్యమ దీక్ష చేపడుతున్నారు. ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు, వివిధ అసోసియేషన్లు ఒక్క తాటిపై నిలిచి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రానికే తలమానికంగా నిలిచి, తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కమిటీ అఽధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అయిదో రోజుకు చేరింది. ఈ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. పల్లా దీక్షకు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పల్లా శ్రీనివాసరావు దీక్షకు సంఘీభావం తెలిపారు.

అటు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 150 మందితో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ఎల్ఐసీ కార్యాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేవరకు తమ ఉద్యమం ఆగదని కార్మిక, ప్రజా సంఘాలు తేల్చి చెబుతున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story