SUPREME COURT: బాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 3కు వాయిదావేసింది. బుధవారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVNభట్టి బెంచ్ ముందుకు వచ్చింది. అయితే విచారణ చేపట్టేందుకు జస్టిస్ భట్టి విముఖంగా ఉన్నారంటూ జస్టిస్ ఖన్నా పిటిషన్‌ను మరో బెంచ్‌కు పంపారు. వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సీజేఐ ఎదుట ప్రస్తావించారు. అయితే ఈ కేసులో చాలా అంశాలను పరిశీలించాల్సి ఉన్నందున అక్టోబర్ 3న విచారణ చేపడతామని CJI స్పష్టం చేశారు.
పిటిషన్ విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరిగాయి. చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సాధ్యమైనంత త్వరగా తదుపరి విచారణ తేదీని ఖరారు చేయాలని కోరగా వచ్చే వారం చేపడతామని జస్టిస్ ఖన్నా బదులిచ్చారు. చంద్రబాబు తరపు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ఈ కేసు అత్యవసరత దృష్ట్యా సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేయడానికి సమయం ఇవ్వాలని త్వరగా విచారణకు స్వీకరించేలా సీజేఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అందుకు జస్టిస్ ఖన్నా అంగీకరించారు. దాంతో సిద్ధార్థ లూథ్రా వెంటనే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం ముందుకు వెళ్లి కేసు గురించి వివరించారు. ఈ కేసును సోమవారం మీ ముందు మెన్షన్ చేశామని, దాన్ని దృష్టిలో ఉంచుకుని బుధవారం లిస్ట్ చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు పెట్టారని చెప్పారు. ఆయన రిమాండు 15 రోజులు పూర్తయిన తర్వాత పోలీస్ కస్టడీ అడుగుతున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
17ఎ కింద FIRలు దాఖలు చేయడంపై చట్టబద్ధమైన ఆంక్షలు ఉన్నాయని, ఆ విషయాన్ని యశ్వంత్‌సిన్హా, , స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఈనెల 8న చంద్రబాబుని చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని దాన్ని తాము తొలిరోజు నుంచీ వ్యతిరేకిస్తున్నట్లు సీజేఐ ధర్మాసనానికి చెప్పారు. 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కేసు పెట్టడం చట్టవిరుద్ధమని అది లేకుండా FIR నమోదు చేయడం, చంద్రబాబును అరెస్ట్ చేయడం వీలుకాదన్నారు. ఇక్కడ అదే ప్రధానాంశమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ప్రతి ఒక్కరూ బెయిల్ మీద బయట ఉన్నారని, చంద్రబాబు ఒక్కరినే జైల్లో పెట్టారని చెప్పారు. 13వ రోజున రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారని, అది పూర్తయిందని 15 రోజుల తర్వాత మళ్లీ కస్టడీ పొడిగింపు కోరుతున్నారని, చట్టప్రకారం అదెలా సాధ్యమో తనకు అర్థం కావడం లేదన్నారు.
ప్రస్తుతం ఒకదాని తర్వాత మరొకటి FIRలు నమోదు చేయడం ప్రారంభించారని సీజేఐకి వివరించారు. లూథ్రా అభ్యర్థనను ప్రభుత్వం తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ తిరస్కరించారు. కింది కోర్టులో చోటుచేసుకున్న పరిణామాలను తాము వచ్చే మంగళవారం ధర్మాసనం దృష్టికి తీసుకొస్తామన్నారు. ఆ వాదనలను తోసిపుచ్చిన లూథ్రా... 15 రోజుల తర్వాత పోలీసు కస్టడీ కోరడానికి వీల్లేదన్నారు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత కేసును 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చెబుతూ ప్రధాన న్యాయమూర్తి విచారణ ముగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com