- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు...
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..!

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ఒక్క విద్యార్థికి మరణం సంభవించినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.. అయితే, దీనిపై ఘాటుగానే రియాక్ట్ అయింది ధర్మాసనం.
ఏపీ నుంచి స్పష్టత లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇన్నిరోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆఫ్‌లైన్ పరీక్షల నిర్వహణ విధానంపై రెండ్రోజుల్లో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.
అటు 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.. ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ప్రైవేటు, కంపార్ట్‌మెంట్ విద్యార్థులకు ఆగస్టు 15, సెప్టెంబరు 15 మధ్య పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఐఐటీ జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలకు ఈ తేదీలు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అటు 11వ తరగతి పరీక్షలు సెప్టెంబరులో జరుపుతామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com