SURAVARAM; కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్‌రెడ్డి ఇకలేరు

సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వయోభారం, శ్వాసకోశ సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య డాక్టర్ బీవీ విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. 1942 మార్చి 25న జోగులాంబ గద్వాల జిల్లా కంచుపాడులో జన్మించిన సుధాకర్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. 15 ఏళ్ల వయసులోనే విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1974 నుంచి 1984 వరకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. 1988లో నల్గొండ నుండి లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. 2004లో మళ్లీ అదే నియోజకవర్గం నుండి గెలిచారు. 2000లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, 2018 వరకూ ఆ పదవిలో కొనసాగారు. విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక పోరాటం, తెలంగాణ ఉద్యమం వంటి కీలక సందర్భాల్లో ఆయన నాయకత్వం విశేషంగా నిలిచింది. తెలంగాణకు ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరి మార్చడంలో సుధాకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇతర వామపక్ష నేతలు ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "పీడిత వర్గాల కోసం జీవితమంతా కృషి చేసిన ప్రజానేత" అని ఆయనను స్మరించారు. సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించి, అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి అందజేస్తారు. ప్రజానాయకుడిగా, వామపక్ష ఉద్యమాల మార్గదర్శిగా ఆయన స్ఫూర్తి చిరస్మరణీయంగా నిలిచిపోతుంది..అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆలోచనలు, పోరాట స్ఫూర్తి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com