Polavaram Project: ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

Polavaram Project:  ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు
X
లొసుగులు తెలుస్తాయనే మసి చేశారా?

గత ఐదేళ్లూ పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన దొంగలు ఇప్పుడు దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తున్నారా? నకిలీ పత్రాలు సృష్టించి అర్హులకు అందాల్సిన సొమ్మును పక్కదారి పట్టించిన కేటుగాళ్లు ఆధారాల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నారా.? వైకాపా దళారుల చేతిలో దగాపడిన పోలవరం నిర్వాసితులు ఔననే అంటున్నారు! ధవళేశ్వరంలో దస్త్రాల దహనం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తేనే.. అక్రమాల డొంక కదిలే అవకాశం ఉంది.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ కేసులో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్‌ ఆర్‌ఐ కళాజ్యోతి, సబార్డినేట్‌ రాజశేఖర్‌ను కలెక్టర్‌ పి. ప్రశాంతి సస్పెండ్‌ చేశారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్లు ఎ. కుమారి, ఎ. సత్యదేవికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే లేదని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో పలు కీలకమైన ఫైళ్లను కాల్చివేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలవరం లెఫ్ట్ కెనాల్ భూసేకరణ దస్త్రాలను ఆఫీసు గేటు బయట సిబ్బంది దగ్ధం చేశారు. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో సగం కాలిన ఫైళ్లను కొన్నింటిని లోపలకు తరలించారు. అసలు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఫైళ్లు దగ్ధం చేయడం, కాల్చివేసిన స్వీపర్‌ విశాఖ వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలవరం ఫైళ్లు దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆఫీసును ఆయన పరిశీలించారు. తగలబెట్టిన ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో జిరాక్స్‌ పేపర్లుగా చెప్పడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆధారాలను మాయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Tags

Next Story