AP: తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ సిబ్బంది వెతలు

AP: తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ సిబ్బంది వెతలు
చాలీచాలని జీతాలతో అవస్థలు

గర్భిణీలు, బాలింతల ఇంట్లో వెలుగులు నింపే తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది కంట కన్నీళ్లే మిగులుతున్నాయి. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. పేరుకే పైలెట్‌ అని పిలుస్తున్నా జీతాలు మాత్రం దుర్భరంగా ఉన్నాయని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 500 మంది సిబ్బంది తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కింద పనిచేస్తున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కో పైలెట్‌ను నియమించారు. కొందరిని 104 సేవలకు కూడా పంపుతున్నారు. వీరికి నెలకు 9 వేల రూపాయలు వేతనంగా గతంలో నిర్ణయించారు. ఇప్పటికీ అదే వేతనం ఉందనీ... ఇందులోనే పీఎఫ్‌ కూడా జమ చేసుకుంటున్నారని. మిగతా జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు. వేతనాలు పెంచకపోగా కనీసం ఆప్కాస్‌లోకి సైతం తీసుకోవట్లేదని మండిపడుతున్నారు.

విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రి లాంటి పెద్ద ఆస్పత్రుల వద్ద ఎక్కువ సంఖ్యలో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ఉంటాయి. ఇలాంటి చోట్ల తమకు కనీసం తినేందుకు ఆహారం, కూర్చునే సౌకర్యం, తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో లేదని సిబ్బంది చెబుతున్నారు. గ్లూకోజ్ తక్కువగా ఉన్న గర్భిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి చికిత్స చేసిన అనంతరం ఇంటికి సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను కూడా తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి అప్పగించారు. దీంతో పనిభారం పెరిగిందని చెబుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి... కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

నెలకు 60 మందిని కనీసం గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందిపై అదనపు పనిభారం మోపుతున్నారు. కొందరిని 104 సేవలకు పంపుతున్నారు. దీంతో సిబ్బందిపై ఆర్థికంగా భారం పడుతుంది. తాను పనిచేసే చోటు నుంచి 104 వాహనం వరకు వెళ్లేందుకు రవాణా ఛార్జీలు, కనీస అవసరాలకు ఖర్చులు అవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ ఉద్యోగి 45 రోజుల పాటు 104 సేవలు కొనసాగిస్తే సుమారు 5వేల రూపాయల పెట్రోలు, ఛార్జీల రూపంలోనే ఖర్చయిపోయాయని వాపోయారు. వాహనానికి ప్రమాదం జరిగితే వాటికి అయ్యే ఖర్చును ఉద్యోగి నుంచి రికవరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు గ్లూకోజ్ తక్కువగా ఉన్న గర్భిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి చికిత్స చేసిన అనంతరం ఇంటికి సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను కూడా తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి అప్పగించారు. దీంతో పనిభారం పెరిగిందని చెబుతున్నారు.

Tags

Next Story