CBN: నిర్లక్ష్యం వహిస్తే అభ్యర్థుల మార్పు

CBN: నిర్లక్ష్యం వహిస్తే అభ్యర్థుల మార్పు
సీట్లు దక్కిన నేతలకు చంద్రబాబు హెచ్చరిక... ఎన్నికల వరకూ ప్రతి వారం సర్వే చేస్తానన్న తెలుగుదేశం అధినేత

సీట్లు దక్కాయనే ధీమాతో సరిగా పనిచేయకుంటే అలాంటి వారిని మార్చేందుకు వెనకాడనని తొలి జాబితా అభ్యర్ధులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల వరకూ ప్రతి వారం సర్వే చేస్తానని తేడా వస్తే వేటు తప్పదని తేల్చిచెప్పారు. అహానికి పోకుండా అసంతృప్తి నేతలు, కార్యకర్తలను కలుపుకునిపోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందికదా అని.. ఏ ఒక్కరూ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు.


సార్వత్రిక ఎన్నికలకు తొలి జాబితాలో ప్రకటించిన 94 మంది అభ్యర్థులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేస్తానని.. తేడా వస్తే వేటు తప్పదని తేల్చిచెప్పారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న ఆయన.. ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని..సూచించారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి 10 సార్లు స్వయంగా వెళ్లి కలవాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. జనసేన నేతలను కలుపుకునిపోయేలా సమన్వయంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.


ఇరుపార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. 1.3 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుని, అనేక సర్వేలు పరిశీలించి అభ్యర్ధులను ఎంపిక చేశానన్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలోనూ ఇటువంటి ప్రయత్నం జరగలేదన్నారు. ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదన్నారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు..జనం సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని.. స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనపై గ్రామాల్లో వైకాపా నేతలు, కార్యకర్తలు..అసంతృప్తితో ఉన్నారని, మంచివారు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

జగన్ ఎన్నికలకు సిద్దంగాలేడన్న ఆయన సిద్ధం అని సభలు పెడుతూ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం తన పాలనను నమ్ముకోలేదని చంద్రబాబు అన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడని.. ఆరోపించారు. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోవడం సహా ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలన్నారు. ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తాడని అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన ప్రణాళికపై అభ్యర్థులతో చంద్రబాబు చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story