CBN: అర్థం చేసుకోండి.. అండగా ఉంటా

CBN: అర్థం చేసుకోండి.. అండగా ఉంటా
సీట్లు ఇవ్వలేకపోయిన నేతలను చంద్రబాబు బుజ్జగింపులు... రాజకీయ భవిష్యత్తుపై హామీ..

జనసేనతో పొత్తులో భాగంగా సీట్లు ఇవ్వలేకపోయిన తెలుగుదేశం నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. తెనాలి సీటు జనసేనకు కేటాయించడంతో ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఆలపాటి రాజాను పిలిచి మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని.... తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. తర్వాత లోకేష్ ని కలిసిన ఆలపాటి రాజా చంద్రబాబుతో భేటీ పట్ల సంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. రాజానగరం సీటును జనసేనకు ఇవ్వడంతో... ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని చంద్రబాబు పిలిచి మాట్లాడారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ లేదా మరో ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబుతో సమావేశం తర్వాత వెంకటరమణ చౌదరి.... సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.


జనసేనతో పొత్తు ఉన్నందున పరిస్థితి అర్థం చేసుకోవాలని అనకాపల్లి లోక్ సభ సీటు ఆశిస్తున్న పీలా గోవింద్ తో అన్నట్లు తెలుస్తోంది. పీలాకు సీటు విషయమై మళ్లీ మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది. ఇంకా టికెట్లు ప్రకటించని... స్థానాల నేతలతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే...... తొలి జాబితాలో పేరు ప్రకటించలేదని దేవినేని ఉమాకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు మాటే శిరోధార్యమని భేటీ తర్వాత ఉమా చెప్పారు. గంటా శ్రీనివాసరావుతో కూడా చంద్రబాబు చర్చించారు. ఎక్కడి నుంచి పోటీ చేయించే విషయాన్ని.... తనకు వదిలిపెట్టమని అధినేత చెప్పినట్లు ఆయన వివరించారు.


సార్వత్రిక ఎన్నికలకు తొలి జాబితాలో ప్రకటించిన 94 మంది అభ్యర్థులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేస్తానని తేడా వస్తే వేటు తప్పదని తేల్చిచెప్పారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న ఆయన ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి 10 సార్లు స్వయంగా వెళ్లి కలవాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. జనసేన నేతలను కలుపుకునిపోయేలా సమన్వయంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఇరుపార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. 1.3 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుని, అనేక సర్వేలు పరిశీలించి అభ్యర్ధులను ఎంపిక చేశానన్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలోనూ ఇటువంటి ప్రయత్నం జరగలేదన్నారు. ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదన్నారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని.. స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనపై గ్రామాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు..అసంతృప్తితో ఉన్నారని, మంచివారు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story