TDP-JAANSENA: టీడీపీ-జనసేన కార్యాచరణ ముమ్మరం

TDP-JAANSENA: టీడీపీ-జనసేన కార్యాచరణ ముమ్మరం
ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసిన ఇరు పార్టీలు... ఇక పోరుబాటే అంటున్న నేతలు

వచ్చే ఎన్నికలకుఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని నిర్ణయించిన తెలుగుదేశ, జనసేన ఆ దిశలో కార్యాచరణ ముమ్మరం చేశాయి. ఈ మేరకు తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులకు చోటు కల్పించారు. తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు.., పట్టాభికి చోటు కల్పించారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ లకు కమిటీలో చోటు ఇచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ ఈనెల 13న మొదటి సమావేశం కానుంది. ఈనెల 8న జరిగిన తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండోసమావేశంలోఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని ఇరుపార్టీలు తెలిపాయి.

వైసీపీ ప్రభుత్వ అవినీతిని జనసేన ఆధారాలతో ఎండగడుతుంటే మంత్రులు అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారని ఆ పార్టీ P.A.C ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. కోట్లు ఖర్చు పెట్టి పాలవెల్లువ పథకం అమలు చేస్తుంటే ఏపీలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. పాలవెల్లువ పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న మనోహర్‌.... ఆ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో చెప్పాలని నిలదీశారు. నవంబర్ 14 నుంచి రోజూ వైసీపీ చేస్తున్న అవినీతి స్కాముల గురించి బయటపెడతామని వెల్లడించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళలతో మనోహర్ సమావేశం అయ్యారు. ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ-జనసేన కలిసి నడుస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ-జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా అది మహిళల అభివృద్ధి కోసమే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈసారి వేసే ఓటు అందరి భవిష్యత్తు కోసం వేయాలని కోరారు.

మరోవైపు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ ను సీఎం జగన్ సర్వ నాశనం చేశారని తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి జగన్ మళ్లీ ఎందుకు కావాలో వైసీపీ నేతలు ఒక్క కారణం చెబితే చాలన్నారు. జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలతో పుస్తకమే ముద్రించవచ్చని కన్నా వివరించారు. ఇటు... పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మద్దతుగా తెలుగుదేశం నేత నిమ్మల రామానాయుడు మరో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి అద్దెలు, బ్యాంకు బకాయిలు కట్టుకోలేని పేదలు, మహిళల కోసం బిక్షాటన చేశారు. లబ్ధిదారులతో కలిసి దుకాణాల వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. వర్తకులు సైతం తోచిన సాయం చేసి నిరసనకు సంఘీభావం తెలిపారు. ఇళ్ల పేరుతో పేదలను మోసిన చేసిన జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఈ నెల 15వ తేదిన ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు నిమ్మల రామానాయుడు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story