Yuvagalam: రాజధాని ప్రాంతంలో లోకేశ్‌ పాదయాత్రకు పోటెత్తిన జనం

Yuvagalam: రాజధాని ప్రాంతంలో లోకేశ్‌ పాదయాత్రకు పోటెత్తిన జనం
X
యువనేతను అక్కున చేర్చుకున్న దళిత, చేనేత, మైనార్టీలు

రాజధాని ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చాయి. అశేష జన జన ప్రవాహం యువ నేతకు మద్దతుగా నిలిచింది. కిక్కిరిసిన రహదారుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయ్రాత సాగుతోంది. రాజధాని ప్రాంతంలోని సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో ఈ యాత్ర జోరుగా సాగింది. మంగళగిరిలో ప్రధాన సామాజిక వర్గాలైన దళిత, చేనేత వర్గాలు లోకేశ్‌ వెంట నడిచాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాతో ఫ్రీడమ్‌ వాక్‌ చేశారు. నిడమర్రు శివారు నుంచి యువగళం పాదయాత్ర మంగళగిరి శివారు వరకు సాగింది. పాదయాత్ర నియోజకవర్గంలోకి అడుగు పెట్టకముందే వైసీపీ ముఖ్య నాయకుల చేరికలతో లోకేశ్‌ ప్రభంజనం సృష్టించారు.

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్‌ యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. వివిధ గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు నిడమర్రు శివారు క్యాంప్‌సైట్‌కు చేరుకున్నాయి. అన్నీదారులు నిడమర్రు వైపే అన్నట్లుగా అందరూ వాహనాలతో బయలుదేరడంతో నిడమర్రు రోడ్డు కిటకిటలాడింది. తొలుత క్యాంప్‌సైట్‌ నుంచి నిడమర్రు వరకు లోకేశ్‌ జాతీయ జెండాను పట్టుకుని ఫ్రీడమ్‌వాక్‌లో పాల్గొన్నారు. ఈ ఫ్రీడమ్‌ వాక్‌లో వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు దిష్టితీసి, హారతులు పడుతూ నీరాజనాలు పలికారు. పసుపు తోరణాలతో స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. నిడమర్రు నుంచి మంగళగిరి వరకూ మహా పాదయాత్ర సాగింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వేలాది మంది కార్యకర్తలు, ప్రజలతో నిడమర్రు రోడ్డు కిక్కిరిసిపోయింది. నిడమర్రుపల్లె, బేతపూడి బాపూజీనగర్‌, శిబిరం వద్ద వందలాది మంది దళితులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. మంగళగిరి పాతబస్టాండ్‌ సెంటర్‌ లోకేశ్‌ రాకకు ముందే జనసంద్రాన్ని తలపించింది. నేతన్నలు చిలపనూలుతో రూపొందించిన 30 అడుగుల గజమాలతో లోకేశ్‌కు స్వాగతం పలికారు. చేనేత చిహ్నాలైన మగ్గం, రాట్నాల ప్రదర్శనతో సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ముఖ్యనాయకులతో పాటు ఆరు గ్రామాలకు చెందిన ఐదు వందల వైసీపీ కుటుంబాలను పార్టీలో చేర్చుకుని వైసీపీకి లోకేశ్‌ షాక్‌ ఇచ్చారు.

నిడమర్రు సెంటర్లో దుగ్గిరాల పసుపు రైతులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. వ్యవసాయంపై అవగాహనలేని ముఖ్యమంత్రి వల్లే రైతులకు ఈ అగచాట్లు వస్తున్నాయని లోకేశ్‌ తెలిపారు. నిడమర్రులో పలువురు సర్పంచ్‌లు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. పంచాయతీలకు తిరిగి పునర్‌వైభవం తీసుకువస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. నిడమర్రు రైల్వేగేటు సమీపంలో మహిళలతో సమావేశమైన లోకేశ్‌.. టీడీపీ అధికారంలోకి రాగానే శాంతిభద్రతలను కట్టుదిట్టంగా కాపాడడంతో పాటు మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. మంగళగిరి పాతబస్టాండ్‌ సెంటర్లో ముస్లింలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్‌ బ్యాంకును ఏర్పాటు చేయించి ముస్లీంలకు సబ్సిడీ రుణాలను అందిస్తామన్నారు.

Tags

Next Story