'ఆంధ్రా నీరో జగన్ రెడ్డి'.. ఇప్పుడైనా మేల్కో : నారా లోకేశ్

ఏపీలో పాలన లేదు.. అభివృద్ధి జాడ ఎక్కడా కనిపించదు.. కానీ, దాడులు, వేధింపులు, కక్ష సాధింపులు ఎప్పుడూ చూడనంతగా పెరిపోతున్నాయి.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్నదంతా ఇదే అంటున్నారు టీడీపీ నేతలు. పాలన చేతకాక చంద్రబాబు సహా టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడుతున్నారు. ఇదేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఛీత్కారాలకు దిగడాన్ని ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా తప్పుపడుతోంది.. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయకపోవడం దుర్మార్గమంటున్నారు టీడీపీ నేతలు. కృష్ణా పరీవాహక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయని.. ప్రజలు సర్వం కోల్పోయి అవస్థలు పడుతుంటే సీఎం జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
ఇక గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పర్యటించిన వైసీపీ ప్రజాప్రతినిధుల బృందం తీరుకు సంబంధించిన వీడియోను లోకేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏం కావాలి రా మీకు? మమ్మల్నే ప్రశ్నిస్తారా? పోండి అవతలకి అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేకపోవడం దారుణమని, ఆదుకోమని అడిగితే ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా నీరో జగన్ రెడ్డి గారు ఇప్పుడైనా మేల్కోవాలి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రజాప్రతినిధులే కాదు.. ముఖ్యమంత్రి కూడా వరద బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.. వరద ముంపు ప్రాంతాల్లో ఈ ముఖ్యమంత్రి కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే జగన్‌కు వచ్చిన బాధేంటని ఆయన ప్రశ్నించారు.
అంతేకాదు, చంద్రబాబు మొదలు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైసీపీ సర్కార్ పనిచేస్తుందని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ధోరణిలో వైసీపీ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. మొత్తంగా వరద బాధితల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వరదలు వచ్చిన సమయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ఇప్పటి పరిణామాలను విపక్షాలతోపాటు ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com