Nara Lokesh: రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇరిగేషన్ కాలువల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కారు వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలైందని విమర్శించారు. ఈమేరకు అనకాపల్లిలో తనను కలిసిన గంగాదేవి పేట రైతులతో లోకేశ్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాతకు అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. శారద కాలువ పూడిక తీయిస్తామని లోకేశ్ చెప్పారు.
అనకాపల్లిలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ మునగపాకలో అంగన్ వాడీలు ఆందోళన శిభిరాన్ని సందర్శించారు. అంగన్ వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందిపోయి అంగన్ వాడీలను జగన్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ఇది ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆరోపించారు. అంగన్ వాడీ కేంద్రాలను వాలంటీర్లతో నడిపిస్తామన్న మంత్రుల వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీల న్యాయమైన కోరికలను తీరుస్తామని లోకేశ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
ఈనెల 18వ తేదీన గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద యువగళం పాదయాత్ర ముగియనుంది. యువగళం ముగింపునకు గుర్తుగా భారీపైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ తల్లి భువనేశ్వరితోపాటు నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరు కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com