డీఐజీ ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబును తప్పుపడతారా? : వర్ల రామయ్య

డీఐజీ ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబును తప్పుపడతారా? : వర్ల రామయ్య
దాడులు జరిగితే చర్యల కోసం ప్రశ్నించడం తప్పవుతుందా..? అసలు ముద్దాయిలను త్వరగా అరెస్టు చేయమని కోరడం నేరమవుతుందా..? ఏపీ పోలీసులకు ఇవే ప్రశ్నలు సంధిస్తున్నా..

దాడులు జరిగితే చర్యల కోసం ప్రశ్నించడం తప్పవుతుందా..? అసలు ముద్దాయిలను త్వరగా అరెస్టు చేయమని కోరడం నేరమవుతుందా..? ఏపీ పోలీసులకు ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు టీడీపీ నేతలు.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు నిత్యకృత్యమయ్యాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు.. అయితే, ఈ లేఖపై పోలీసులు స్పందించిన తీరును ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు.. టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య డీజీపీకి మరో లేఖ రాశారు.. సమాధానం చెప్పాలంటూ పోలీసులపై లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు.

రాజమండ్రిలో ముస్లిం బాలికపై అత్యాచారయత్నం కేసులో ముద్దాయిల అరెస్టులో జాప్యం ఎందుకని ప్రశ్నించడం తప్పా? ఫిర్యాదు వాపస్‌ తీసుకోవాలని బాధితుల ఇంటిపై దాడిచేసి బెదిరించింది నిజం కాదా..? బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నానికి కారణం పోలీసులు చెప్పగలరా..? ఈ కేసులో తీసుకున్న చర్యలపై పోలీసులు రాజమండ్రి వాసులకు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ఇవ్వగలరా..? అంటూ వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.

డీజీపీకి రాసిన లేఖలో సూటి ప్రశ్నలతోపాటు మరికొన్ని అంశాలను కూడా వర్ల రామయ్య ప్రస్తావించారు.. సీతానగరం శిరోముండనం కేసులో ఎస్సై ఫిరోజ్‌ ఫోన్‌కాల్‌ లిస్ట్‌ పరిశీలించి అసలు ముద్దాయిలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఫోన్‌కాల్‌ లిస్ట్‌ పరిశీలించి దళిత యువకుడు ప్రతాప్‌ ఆత్మహత్యకు కారకులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ పోలీసులను సూటిగా ప్రశ్నించారు. పల్నాడులో దళిత యువకుడు విక్రమ్ హత్యకు పరోక్ష కారకుడిగా చెప్పబడుతున్న సీఐ దుర్గాప్రసాద్‌ కాల్‌లిస్ట్‌ ఎందుకు పరిశీలించలేదన్నారు. దళిత కుటుంబంలో ఆరుగురిని సజీవ దహనం చేయడానకి ప్రయత్నించిన అసలు ముద్దాయిలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.

పోలీసులు వెంటనే స్పందించకపోవడం వల్లే అత్యాచార కేసులు పెరుగుతున్నది నిజం కాదా అని పోలీసులను ప్రశ్నించారు. దర్యాప్తులు పర్యవేక్షిస్తున్న సీనియర్‌ పోలీసు అధికారులు కాకుండా.. ఆఫీసులో కూర్చునే టెక్నికల్‌ డీఐజీ ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబును తప్పుపట్టడం ఎంత వరకు సబబు అంటూ వర్ల రామయ్య లేఖలో నిలదీశారు. ఇప్పటికైనా డీజీపీ ఈ కేసులన్నింటిని సమీక్షించాలని.. యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ప్రజలముందుంచాలని వర్ల రామయ్య సూచించారు. ఇన్ని లేఖలు రాసినా.. చంద్రబాబు ఏ ముద్దాయి పేరును చెప్పడం కానీ.. సూచించడం కానీ జరగలేదని వర్ల గుర్తు చేశారు. అసలు నేరస్తులను అరెస్ట్‌ చేయమని కోరడం తప్పా? ఈ విధమైన పోలీసు శాఖ స్పందన రాజకీయ ప్రోద్భలంతో కాదా? అని వర్ల రామయ్య పోలీసులను ప్రశ్నించారు. మొత్తంగా వర్ల రామయ్య రాసిన లేఖపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story