LOKESH: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

LOKESH: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
రాష్ట్రపతికి నారా లోకేశ్‌ విజ్ఞప్తి... చంద్రబాబు అరెస్ట్‌లో జోక్యం చేసుకోవాలని వినతి..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీలో వైకాపా అరాచక పాలనపైనా, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్న తీరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోకేశ్‌ వివరించారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతితో లోకేశ్‌, ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌, కేశినేని నాని సమావేశమయ్యి వినతిపత్రం అందించారు. చంద్రబాబు అరెస్టు జరిగిన తీరును, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అరాచక పాలన వంటి అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.


రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ముర్ముకు వివరించామని లోకేశ్‌ తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరినట్లు తెలిపారు. అన్ని వివరాలు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు లోకేశ్ తెలిపారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు లేకుండానే దానిలో అవినీతి జరిగిందంటూ తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని లోకేశ్ ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ , స్కిల్ కేసుల్లో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన, యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తున్నామని ప్రకటించగానే ప్రభుత్వం భయపడి తప్పుడుకేసు పెట్టిందని మండిపడ్డారు.

అక్రమ కేసులు, అరెస్టుతో చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తెలుగుదేశం నేతలు విన్నవించారు. జగన్‌ సర్కార్‌ పాలనలో దళితులు, ఓబీసీలు, మహిళలపై ప్రభుత్వ పరంగా దమనకాండ సాగుతోందని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన తెలుగుదేశం ఎంపీలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడిపై ఏపీ-సీఐడీ పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారంటూ వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్‌ 10వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత సీఐడీ కోర్టు ఆయన్ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపిందన్నారు. చట్ట, న్యాయ నిబంధనలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ ఆయన్ను అరెస్టు చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని నివేదించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబు పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయడానికి, రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టారని పేర్కొన్నారు. సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్రపతికి వివరణ ఇచ్చారు. తక్షణం కలగజేసుకుని చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని విన్నవించారు.

F.I.R.లో తొలుత చంద్రబాబు పేరు చేర్చని అధికారులు.. అరెస్టు చేసిన తర్వాత చేర్చడం నిబంధనలకు విరుద్ధమన్నారు. చంద్రబాబు లాంటి ప్రజాప్రతినిధి అరెస్టుకు గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరని, దర్యాప్తు అధికారి మాత్రం ఎలాంటి అనుమతి కోరలేదని నివేదించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చంద్రబాబు దేశానికి చేసిన సేవల గురించి ప్రస్తావించినట్లు తెలిసింది.

Tags

Next Story