Chandra Babu: చంద్రబాబుకు అండగా ఉంటాం

చంద్రబాబుకు న్యాయం జరిగే వరకూ పోరు ఆగదని తెలుగుదేశం నేతలు, శ్రేణులు స్పష్టం చేశారు. ఆయన్ని జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి.. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు.
చంద్రబాబు కోసం అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సత్యసాయి జిల్లా గుడిబండలో తెదేపా నేత తిప్పేస్వామి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. రొల్లలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరిలో తెదేపా నేత పులివర్తి నాని ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో రైతులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం అరాచక పాలనను ప్రజలు సంఘటితంగా ఎదుర్కొవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు N.M.D ఫరూక్ అన్నారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని పలువులు తెదేపా నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ.... ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి గ్రామంలో తెదేపా శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల జిల్లా కంకటపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో తెదేపా సీనియర్ నాయకుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని దీక్షా శిబిరాన్ని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో దీక్షలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో తెదేపా శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తెదేపా నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com